వై 7 న్యూస్ భద్రాచలం:
భద్రాచలం పట్టణంలో దేవస్థానం మరియు ప్రభుత్వ భూముల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు భద్రాచలం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడారు.
దేవస్థానం, ప్రభుత్వ భూములను పలుకుబడి ఉన్న వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని, అలాంటి వారి ఆటకట్టించి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జీవనోపాధి కోసం కూలి పని చేసుకునే పేదల గుడిసెలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న చట్టాలను కొంతమంది అధికారులు లంచగొండి ధోరణితో ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసా చట్టం ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని, సహజ వనరులైన అడవులు, ఇసుక, నీరు, గాలి రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న వారు ఎంతటి పెద్దలైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు సాయన్న, మునిగేలా శివప్రశాంత్, మడకం దేవయ్య, మడివి జోగయ్య తదితరులు పాల్గొన్నారు.








