మందమర్రి ,జూలై 21 వై 7 న్యూస్;
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగు ఉమ్మడి ఏజెన్సీ బంద్‌లో భాగంగా, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్‌లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు GO No.49 ప్రతులను కాల్చి నిరసన తెలిపారు.
సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్దలచ్చన్న మాట్లాడుతూ, “GO No.49 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వానికి తోడుగా పేదల భూములను లాక్కొనబోతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులను, ఆదివాసీలను బానిసలుగా మార్చే చట్టాలను తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ జీఓ అమలుతో 339 గ్రామాలు, 3 లక్షల ఎకరాల ఆదివాసీ భూములు ముప్పుకు గురవుతున్నాయని, ఇది వారి జీవనాధారాలనే కూలదొట్టే కుట్ర అని వారు పేర్కొన్నారు. “ప్రాణహిత, కవ్వల్, శివ్వారం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పలు పరిమితులు విధించబడ్డాయి. ఇది ఓ అడుగు ముందే వేయడానికి జీఓ 49ని తెస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన బడాపెట్టుబడిదారులకే అనుకూలంగా సాగుతోందని, కార్మికులను, గిరిజనులను వంచించే విధానాలను వీక్షిస్తూ మౌనం వహించమని హెచ్చరించారు. ఈ విధానాలను తక్షణం వెనక్కి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా కార్మిక, గిరిజన, పేద వర్గాల ఐక్య పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేశ్వర్ రావు, నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.