సింగరేణి భవన్, హైదరాబాద్ | తేది: జూలై 21, 2025
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) గా బి.వెంకన్న సోమవారం నాడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2010 బ్యాచ్ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) అధికారైన ఆయనను మూడు సంవత్సరాలపాటు డిప్యూటేషన్‌పై సింగరేణికి పంపే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం బి.వెంకన్న, సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరామ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, “సింగరేణిలో ప్రతి ఏటా సుమారు 700 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. ఇందులో ఎక్కువభాగం రైలు మార్గం ద్వారా పలు రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. బొగ్గు రవాణాలో సమర్థవంతమైన నిర్వహణ సంస్థ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా బి.వెంకన్న మాట్లాడుతూ, “సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవలందించటం నాకు ఒక గౌరవంగా భావిస్తున్నాను. రవాణా విభాగం లక్ష్యాలను సాధించేందుకు నిష్టతో పనిచేస్తాను. సమయానికి సరఫరా, సమర్ధతతో కూడిన వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.