E-PAPER

ఫిక్కీ సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలను ప్రశ్నించిన ప్రధాని మోదీ..!

కార్పొరేట్ పన్నుల తగ్గింపు, పలు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పరిశ్రమలు ఎంతమందికి కొత్తగా ఉపాధి కల్పించాయి? ఉద్యోగుల వేతనాలను ఎంతమేర పెంచాయి? అంటూ భారత పారిశ్రామిక రంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నించారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్నుల తగ్గింపు, నిబంధనల సరళీకరణ, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల వంటి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని గుర్తుచేశారు. ఆ ఫలాలను ఉద్యోగాల సృష్టి, మెరుగైన వేతనాల రూపంలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత పరిశ్రమలపైనే ఉందని స్పష్టం చేశారు.

దేశ సర్వతోముఖాభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, పారిశ్రామికవేత్తలు సైతం ఈ ప్రగతి ప్రయాణంలో సమాన భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంస్థలే సొంతంగా నిర్దిష్ట వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతిదానికీ ప్రభుత్వంపైనే ఆధారపడవద్దని హితవు పలికారు. విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులకే అత్యున్నత నాణ్యతను కేటాయిస్తూ ‘ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ’ పేరిట ప్రచారం చేయడంపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ వినియోగదారులకు అందించే నాణ్యమైన వస్తువులనే భారతీయ పౌరులు కూడా పొందే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. దేశీయ మార్కెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు.

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. ప్రపంచానికే ఫార్మసీ హబ్ గా పేరుగాంచిన భారత్.. కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై బిలియన్ల డాలర్లు వెచ్చించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమృద్ధిగా ముడి వనరులు ఉన్నప్పటికీ అల్యూమినియం, స్టీల్ రంగాల్లో ప్రత్యేక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తగదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎగుమతుల వాటా కేవలం 2 నుంచి 2.5 శాతానికే పరిమితం కావడంపై దృష్టి సారించాలని, గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వర్గాలకు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!