ప్రపంచ జనాభా ముఖచిత్రంలో రాబోయే రోజుల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. క్రైస్తవ మతాన్ని వెనక్కి నెట్టి 2035 నాటికి ఇస్లాం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మతంగా అవతరించనుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు మతాల్లోనూ జనాభా వృద్ధి ఉన్నప్పటికీ, ముస్లింల సంఖ్య అనూహ్య వేగంతో పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
ఈ జనాభా మార్పునకు మత మార్పిడులు కారణం కాదని, సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేటు) ఎక్కువగా ఉండటమే కీలకమని ప్యూ సీనియర్ డెమోగ్రాఫర్ కాన్రాడ్ హ్యాకెట్ తెలిపారు. 2020-2025 మధ్య కాలంలో ముస్లిం మహిళల్లో సగటున 3.1 సంతానోత్పత్తి రేటు నమోదు కాగా, క్రైస్తవ మహిళల్లో ఇది 2.5గా ఉంది. ఇతర మతాల మహిళల్లో ఈ రేటు కేవలం 1.6 శాతంగా మాత్రమే నమోదైంది.
2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2.27 బిలియన్ల క్రైస్తవులు, 2.02 బిలియన్ల ముస్లింలు ఉండగా.. 2035 నాటికి ముస్లింల జనాభా 2.57 బిలియన్లకు, క్రైస్తవుల సంఖ్య 2.52 బిలియన్లకు చేరుకుంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2070 నాటికి ముస్లిం జనాభా 80 శాతం వృద్ధితో 3.6 బిలియన్లు దాటనుండగా, క్రైస్తవుల సంఖ్య 30 శాతం పెరిగి దాదాపు 3 బిలియన్లకు చేరుకోనుంది. మరోవైపు హిందువులు, యూదుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రపంచ జనాభాలో వారి వాటా తగ్గనుందని నివేదిక అంచనా వేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో జనాభా తగ్గుదల వల్ల బౌద్ధుల సంఖ్య క్షీణించనుంది.
రాబోయే దశాబ్దాల్లో అమెరికా, కెనడాల్లో క్రైస్తవుల ప్రాబల్యం తగ్గి, ఏ మతానికి చెందని వారి సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా పాకిస్థాన్ నిలవనుండగా, భారత్ రెండో స్థానంలో నిలుస్తుందని నివేదిక పేర్కొంది.








