E-PAPER

రెండో పెళ్లి ద్వారా జన్మించిన పిల్లలకూ తల్లి పేరిట ఉన్న ఆస్తిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

మొదటి భర్త కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తిపై హిందూ మహిళకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభిస్తే, ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలు కూడా ఆ ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని వ్యవసాయ భూమి వారసత్వానికి సంబంధించిన వివాదంలో మొదటి భర్త కుటుంబీకుల వాదనను తోసిపుచ్చుతూ, మహిళ రెండో పెళ్లి కుమారులకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఈ వివాదం వివరాల్లోకి వెళితే… ఖజానో అనే మహిళకు మొదటి భర్త మౌజీ రామ్, కుమారుడు రామ్ చందర్ మరణానంతరం సుమారు 45 బిగాల వ్యవసాయ భూమి లభించింది. ఆ తర్వాత ఆమె బాల్‌కిషన్‌ను రెండో వివాహం చేసుకోగా… చంద్ రామ్, చందర్ భాన్ జన్మించారు. ఖజానో మరణం తర్వాత మొదటి భర్త కుటుంబీకులు ఆ భూమి తమ పూర్వీకులదని వాదించగా, రెండో పెళ్లి ద్వారా పుట్టిన కుమారులు వారసత్వ హక్కును కోరారు.

సుల్తాన్ సింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ కమిషనర్ కేసులో న్యాయస్థానం ఈ అంశాన్ని లోతుగా పరిశీలించింది. హిందూ వారసత్వ చట్టం 1956 అమల్లోకి రాకముందే ఖజానో ఆ భూమిని అనుభవిస్తున్నారని, సెక్షన్ 14(1) ప్రకారం ఆమెకున్న పరిమిత హక్కులు కాస్తా సంపూర్ణ యాజమాన్య హక్కులుగా మారాయని కోర్టు పేర్కొంది. దీంతో ఆమె ఆ ఆస్తికి తాత్కాలిక సంరక్షకురాలిగా కాకుండా పూర్తి స్థాయి స్వతంత్ర యజమానిగా గుర్తింపు పొందారని వివరించింది.

ఢిల్లీ భూ సంస్కరణల చట్టం 1954 నిబంధనల ప్రకారం ఆమె మరణించే నాటికి ఉన్న వ్యక్తిగత చట్టాల ఆధారంగా చట్టబద్ధ వారసులైన చంద్ రామ్, చందర్ భాన్‌లకే ఆ భూమి దక్కుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనే మూలాల కంటే, సదరు మహిళ మరణించే సమయానికి ఆ ఆస్తిపై ఆమెకున్న హక్కు స్వభావమే ప్రధానమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!