E-PAPER

చాట్‌జీపీటీ ఫోన్..? మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్‌కు ధీటుగా చాట్‌జీపీటీ ఫోన్ రానుందని సమాచారం.

అందుకు ఊతం ఇచ్చేలా ఐఫోన్‌లను తయారు చేసే ప్రముఖ సంస్థ ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్ ఓపెన్‌ఏఐ తొలి స్మార్ట్‌ఫోన్‌ను అసెంబ్లింగ్ చేసే ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఆండ్రాయిడ్ అథారిటీ సహా పలు టెక్నాలజీ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సప్లైచైన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఓపెన్‌ఏఐ తన తొలి హ్యాండ్‌సెట్ కోసం యాపిల్ సరఫరా వ్యవస్థలోని పలు సంస్థలతో చేతులు కలుపుతోంది. ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్ తుది అసెంబ్లింగ్ బాధ్యతను చేపట్టనున్నట్లు సమాచారం.

గతంలో విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రస్తావించిన లక్స్‌షేర్ ప్రెసిషన్ ఇప్పుడు పూర్తి స్థాయి తయారీ భాగస్వామిగా కాకుండా, ఇతర యాపిల్ సరఫరా సంస్థలైన లింగ్‌యి ఐటెక్, ఏఏసీ టెక్నాలజీస్‌తో కలిసి విడిభాగాల సరఫరాలో పాలుపంచుకోనుందని నివేదికలు హైలెట్‌ చేశాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 2027 చివరిలో లేదా 2028లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇందులో కస్టమ్ మీడియాటెక్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉందని, సాధారణ ఫోన్‌లకు భిన్నంగా ‘ఏఐ-ఫస్ట్’ వినియోగదారు అనుభవంతో దీనిని రూపొందిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

సవాళ్లు ఏమిటి?
అయితే, ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న సంస్థకు భారీ లక్ష్యాలే ఉన్నప్పటికీ, పోటీ మాత్రం అత్యంత కఠినంగా ఉంది. గూగుల్, శామ్‌సంగ్ వంటి దిగ్గజాలు ఇప్పటికే తమ ఫోన్‌లలో అత్యాధునిక ఏఐ ఫీచర్లను నేరుగా అనుసంధానిస్తున్నాయి. కేవలం గెలాక్సీ, పిక్సెల్ లేదా ఐఫోన్‌లలో చాట్‌జీపీటీని డౌన్‌లోడ్ చేసుకుని వాడుకునే బదులు, వినియోగదారులు ప్రత్యేకంగా ఓపెన్‌ఏఐ ఫోన్‌నే ఎందుకు కొనుగోలు చేయాలనే ప్రశ్నకు బలమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ ఫోన్ ప్రాజెక్ట్, డిజైన్, ధర లేదా విడుదల తేదీపై ఓపెన్‌ఏఐ కానీ, ఫాక్స్‌కాన్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!