E-PAPER

శర్వానంద్ ‘భోగి’ కొత్త విడుదల తేదీ ఫిక్స్..! ఎప్పుడంటే..?

శర్వానంద్ కథానాయకుడిగా, మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి ఈ సినిమాను నవంబర్ 12నే విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించింది. అయితే, కొన్ని అనివార్య కారణాలు, నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల విడుదల వాయిదా పడింది. ఆ సమయంలో మేకర్స్ స్పందిస్తూ.. ప్రేక్షకులకు వెండితెరపై అద్భుతమైన అనుభూతిని పంచాలనే లక్ష్యంతో ఎంతో నిబద్ధతతో ‘భోగి’ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలస్యమైనప్పటికీ ప్రేక్షకుల నిరీక్షణకు తగిన విధంగా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. తాజాగా సినిమా విడుదల తేదీని నవంబర్ 27గా ఖరారు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. వెండితెరపై అద్భుతమైన యాక్షన్, భావోద్వేగాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చిత్రబృందం పేర్కొంది.

1960ల ప్రారంభ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక కల్పిత గ్రామం ఆధారంగా ఈ హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిశోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!