చింతూరు, అక్టోబర్ 26 (Y7 న్యూస్):
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రజాపక్షాన నిలబడటమే తమ లక్ష్యమని ఆ పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ తెలిపారు. సోమవారం చింతూరులోని కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏజెన్సీలో కనీస సౌకర్యాలు కరువు
గత ప్రభుత్వాలు రెండున్నర నుంచి ఐదేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని పల్లపు వెంకట్ విమర్శించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
పోలవరం ప్రాజెక్టు కోసం నివాసాలు, భూములు, పచ్చని అడవులను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్లక్ష్యం వహించాయని ఆయన ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ జాబితాల్లో పేర్లు లేకపోవడంతో నిర్వాసితులు గందరగోళానికి గురవుతున్నారని, పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ
చింతూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో సీపీఎం అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు పల్లపు వెంకట్ వెల్లడించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా మహిళా అభ్యర్థి మీడియం శ్రీదేవి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సీసం సురేష్, ఎడమ సుబ్బమ్మ, చింతా రాంబాబు, కారం సుబ్బారావు, వేకా రాజ్ కుమార్, సోడి దుర్గారావు, కలుముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Y7 News Telugu | ప్రజల గొంతుక








