రాజుపేట కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజుపేట కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.



ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, నంబర్ ప్లేట్లు లేని మరో 8 వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 150 కేసులు నమోదు చేసి రూ.36,390 జరిమానా విధించారు.
మత్తు పదార్థాలపై కఠిన చర్యలు
కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ అరుణ్ కుమార్ కాలనీవాసులతో మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వినియోగానికి బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించే విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
కాలనీల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ రాజు, వెంకటప్పయ్య, పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం తదితరులు పాల్గొన్నారు.
— Y7 News Telugu | ప్రజల గొంతుక








