E-PAPER

‘ఫ్రీ కశ్మీర్‌’ నినాదాల కలకలం..! జామియా మిలియా యూనివర్సిటీలో ఉద్రిక్తత..

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన, ‘ఫ్రీ కశ్మీర్‌’ నినాదాల వివాదం నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అన్ని కోర్సుల తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆదేశించింది. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్టోబర్‌ 24న విడుదల చేసిన నోటీసులో పేర్కొంది. 

విద్యార్థుల సంఘాన్ని పునరుద్ధరించాలని, 2026–27 విద్యా సంవత్సరానికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 12 నుంచి కొందరు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలో యూనివర్సిటీ గోడలపై ‘ఫ్రీ కశ్మీర్‌’, ‘ఫ్రీ షర్జీల్‌ ఇమామ్‌’ వంటి నినాదాలు కనిపించడం వివాదానికి దారితీసింది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, వీసీకి వ్యతిరేకంగా కూడా రాతలు కనిపించాయి. 

యూనివర్సిటీ యాజమాన్యం ఈ నినాదాలను తీవ్రంగా ఖండించింది. వాటిని ఎవరు రాశారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. నినాదాలను తొలగించడంతో పాటు, కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాల వైర్లు దెబ్బతిన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. క్యాంపస్‌ బయట పోలీసులు మోహరించగా, లోపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే, నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులు ఈ నినాదాలతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. విద్యార్థుల సంఘం పునరుద్ధరణ, ఎన్నికల తేదీల ప్రకటనే తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేస్తున్నారు. 2006లో విద్యార్థుల సంఘం రద్దయినప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. యూనివర్సిటీ తాజాగా సంఘం రాజ్యాంగాన్ని రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డిసెంబర్‌ 20లోగా ముసాయిదా సమర్పించాలన్న నిర్ణయం ఎన్నికలను మరింత ఆలస్యం చేస్తుందని విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!