E-PAPER

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు..! ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై, స్థానిక యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారని, కశ్మీరీల పట్ల భారత ప్రభుత్వం ఉద్దేశాలు సరిగా లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది. ఆ దేశం దౌత్య ప్రయత్నాల వల్లే ప్రపంచానికి కశ్మీరీల గొంతు వినిపిస్తోంది. అందుకే జమ్మూకశ్మీర్ ప్రజలు ఇప్పుడు బతికి బట్టకట్టగలుగుతున్నారు” అని అన్నారు.

ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పనితీరుపై ఫరూఖ్ నిప్పులు చెరిగారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు ఏడాదికి పైగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో చదివిన వైద్య విద్యార్థులు రెండేళ్లపాటు ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన ఉందని, లేకపోతే రూ. 40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ ఫైల్‌పై కూడా ఏడాదిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. 

ఒకప్పుడు వైద్య సంస్థల డైరెక్టర్లు, కమిటీలు నియామకాలు, పరికరాల కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకునేవారని, ఇప్పుడు ఆ అధికారాలన్నీ తొలగించారని ఆరోపించారు. “మీరు స్వయం ప్రతిపత్తిని అంతం చేశారు కదా అని నేను ఆయన్ను (లెఫ్టినెంట్ గవర్నర్) అడిగితే, నా ముఖం మీదే ఆయన దాన్ని అంగీకరించారు. ఇక ఢిల్లీ నుంచి ఎలాంటి న్యాయం ఆశించగలం?” అని ఫరూఖ్ పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం గొంతు విప్పాలని, ధైర్యంగా వారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అలా చేయకపోతే తుడిచిపెట్టుకుపోతామని హెచ్చరించారు.

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “అధికారం ఉన్నప్పుడే పార్టీతో ఉంటారా? పదవుల కోసం విధేయత చూపవద్దు” అని హితవు పలికారు. తాను ప్రజలకు మాత్రమే కాదని, అల్లాకు కూడా జవాబు చెప్పాల్సి ఉంటుందని, అందుకే ప్రజల ముందు నిజమే మాట్లాడతానని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!