శ్రీకాకుళం జిల్లా, అక్టోబర్ 13 | Y7 న్యూస్ తెలుగు
శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మందస మండలం హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువు మృతిచెందారు. ఈ ఘటన ఈ నెల 10న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మందస మండలం చినకోష్ట గ్రామానికి చెందిన గిరిజన మహిళ బసవతి ఈశ్వరి (26) ప్రసవం కోసం హరిపురం CHCలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 10న ఉదయం ఆమెకు సాధారణ ప్రసవం జరిగిందని, అయితే అదే రోజు సాయంత్రానికి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతిచెందినట్లు వెల్లడించారు.
మరోవైపు, ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శిశువు గర్భంలోనే మృతిచెందినట్లు పేర్కొన్నారు. తల్లి మృతికి ఉమ్మనీరు రక్తప్రవాహంలోకి చేరడం వల్ల సంభవించే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం (Amniotic Fluid Embolism) కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
అయితే, తల్లీబిడ్డ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, మరణాలకు ఖచ్చితమైన కారణాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత వైద్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Y7 న్యూస్ తెలుగు | ప్రజల గొంతుక








