E-PAPER

ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి

ఎంపికైన 76 మందిని విధుల్లోకి తీసుకోవాలి.. వేతనాలు ప్రతినెలా చెల్లించాలి: ఏఐటీయూసీ

ములుగు జిల్లా, అక్టోబర్ 13 (Y7 న్యూస్ తెలుగు):

ములుగు జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన 76 మంది టీచర్లు (ఇన్‌స్ట్రక్టర్లు), ఆయాలకు వెంటనే నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ప్రతి నెలా వేతనాలను అదే నెలలో అందించాలని కోరారు.

ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలంగాణ ప్రీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాల సమావేశం కె. అంకిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపాల రవీందర్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలను విద్య వైపు మళ్లించేందుకు ప్రీ ప్రైమరీ పాఠశాలల పేరుతో టీచర్లు, ఆయాలను నియమించినప్పటికీ, వారి ఉద్యోగ భద్రత విషయంలో అనేక ఆందోళనలు ఉన్నాయని అన్నారు.

వేతనాలను నేరుగా ప్రభుత్వమే చెల్లించకుండా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అందించడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జూన్‌ నెల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉంటే వారు జీవనం ఎలా సాగిస్తారని ప్రశ్నించారు. ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టడం వల్ల ఈ పథకం భవిష్యత్తుపై ఉద్యోగుల్లో సందేహాలు నెలకొన్నాయని తెలిపారు.

ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టే సమయంలో వాటిలో పనిచేసే ఉద్యోగులకు నిరంతర ఉద్యోగ భద్రత కల్పించేలా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కోరారు. జిల్లాలో ఎంపికైన 76 మంది టీచర్లు, ఆయాలకు ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం, విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వెంటనే వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అందిస్తున్న ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో పాటు ఇతర సంక్షేమ సౌకర్యాలను కూడా ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు వర్తింపజేయాలని జంపాల రవీందర్ డిమాండ్ చేశారు.

ఏకగ్రీవంగా నూతన యూనియన్ కమిటీ ఎన్నిక

సమావేశం అనంతరం యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సౌలం రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా కల్లెబోయిన అంకిత, కోశాధికారిగా సయ్యద్ సోనీ, ఉపాధ్యక్షురాలిగా ధరావత్ గౌతమి, సహాయ కార్యదర్శిగా కొయ్యడ మౌనిక ఎన్నికయ్యారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముత్యాల రాజుతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాలు గౌతమి, సోనీ, ప్రియాంక, కాంత, అంకిత, రమాదేవి, సునీత, మమత, థైరుణ్, సమ్మక్క, సరిత, మాధవి, మౌనిక, శివరాణి, నిర్మల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Y7 న్యూస్ తెలుగు – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!