E-PAPER

ఈ-క్రాప్ పంట నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్

బాపట్ల, అక్టోబర్ 10 (Y7 న్యూస్ తెలుగు):

ఈ-క్రాప్ యాప్‌లో నమోదైన పంట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం కంకటపాలెం గ్రామంలో పంట పొలాలను పరిశీలించి, పంట సాగు వివరాలు, నీటి లభ్యతపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కంకటపాలెం నుంచి చెరువు జమ్ములపాలెం వెళ్లే మార్గంలో నల్లమోతు శాంతకుమారికి చెందిన 70 సెంట్ల పొలంలో సాగు చేస్తున్న వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. పొలం హద్దులను రైతులను అడిగి తెలుసుకోవడంతో పాటు గ్రామ మ్యాప్ ఆధారంగా వాటిని పరిశీలించారు. వరి పంట ఎప్పుడు వేశారు, సాగు విధానం ఎలా ఉంది, పంటకు అవసరమైన నీరు ఏ విధంగా అందుతోంది అనే వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.

మోటర్ల ద్వారా నీటి సరఫరాపై కలెక్టర్ ఆరా

కాలువల నుంచి మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో, ఈ విధానం సరైనది కాదని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో కాలువల ద్వారా విడుదల చేసే నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చూడాలని సూచించారు. మోటర్లను వెంటనే తొలగించాలని రైతులకు ఆదేశించారు. మోటర్లను తొలగించని పక్షంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు

కంకటపాలెం నుంచి చెరువు జమ్ములపాలెం వెళ్లే మార్గంలో రహదారి నిర్మించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన, రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి, వి.బి.-జి రామ్ జీ పథకం కింద ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీడీవోను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి హరికుమార్, తహసీల్దార్ సలీమా, మండల వ్యవసాయ అధికారి శారద, బాపట్ల ఎంపీడీవో బాబురావు, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

— Y7 News Telugu | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!