అశ్వాపురం, అక్టోబర్ 10 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని మంచికంటినగర్‌లో నిర్వహిస్తున్న అరిఫా, రోషిని అండ్ రీమా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షహనాజ్ బేగంకు అంతర్జాతీయ శాంతి, ప్రతిభ పురస్కారం లభించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.

పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు శనివారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి, షహనాజ్ బేగంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు ఎస్.కె. రెహమాన్ మాట్లాడుతూ, తమ ముస్లిం సోదరికి అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు అశ్వాపురం మండలంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా వృద్ధులకు సేవలందిస్తున్న షహనాజ్ బేగం సేవలకు తమ సొసైటీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.
కొందరు తమ ఇళ్లలో ఒకరిద్దరు వృద్ధులను చూసుకోవడానికే ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత సమాజంలో, ఎంతోమంది వృద్ధులను అక్కున చేర్చుకుని వారి చివరి దశలో ఆప్యాయతతో సేవలందించడం గొప్ప విషయమని రెహమాన్ అన్నారు. వృద్ధులకు తల్లిలా అండగా నిలుస్తూ, వారి ఆలనాపాలనా చూసుకుంటున్న షహనాజ్ బేగం మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.కె. రెహమాన్, ట్రెజరర్ గౌసిద్దీన్, జనరల్ సెక్రటరీ ఎస్.కె. కాజా మియా, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.డి. యూసఫ్, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షహనాజ్ బేగం, మెహరాజ్ దంపతులు పాల్గొన్నారు.









