అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు.. 22 నుంచి యథావిధిగా కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 12 రోజుల సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల సమయంలో లబ్ధిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనానికి బదులుగా టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబర్ 22వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయి.
ఈ మేరకు అవసరమైన సూచనలను తమ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు (DWOs), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (CDPOs)ను శాఖ ఆదేశించింది.
మంత్రి సీతక్కకు అంగన్‌వాడీ సంఘాల కృతజ్ఞతలు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తరహాలో బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేయడంపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ చరిత్రలో తొలిసారిగా దసరా సెలవులు ప్రకటించి, సిబ్బంది పండుగలను ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు ఇంద్ర ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (INTUC) రాష్ట్ర అధ్యక్షురాలు డి. అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.









