E-PAPER

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: సీపీఎం

నిరుపేదలందరికీ రాజకీయ జోక్యం లేకుండా రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

బూర్గంపాడు, అక్టోబర్ 9, Y7 న్యూస్ తెలుగు:

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బూర్గంపాడు సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా సీపీఎం నాయకులు ఆయనను కలిసి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రెండో విడతలో రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హులైన నిరుపేద కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ముందుగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించని పక్షంలో, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలను సమీకరించి, వారి హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే హామీ

సీపీఎం నాయకుల వినతిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. మొదటి విడతలో అర్హులైన లబ్ధిదారులకే రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చివరి బిల్లు ఒకటి పెండింగ్‌లో ఉందని, అది కూడా త్వరలో వస్తుందని పేర్కొన్నారు.

రెండో విడతలోనూ నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సీపీఎం నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్‌కే అబిదా, కనకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

— Y7 న్యూస్ తెలుగు | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!