బూర్గంపాడు, అక్టోబర్ 9 (Y7 న్యూస్ తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. గ్రామ పంచాయతీ పరిధిలో రూ.1.02 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.



ఈ సందర్భంగా తొలుత సారపాకలోని శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామంలో మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారానికి, పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సైడ్ డ్రైన్ నిర్మాణాలు దోహదపడతాయని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సంబంధిత అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
— Y7 News Telugu | ప్రజల గొంతుక









