ప్రమోషనల్ రీల్స్ చేస్తే రూ.30 వేల పారితోషికమంటూ ఆఫర్.. స్పృహ కోల్పోయిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు
మంగళగిరి: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని, ప్రమోషనల్ రీల్స్ పేరుతో యువతిని మంగళగిరికి పిలిపించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువకుడిపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన యువతికి మంగళగిరికి చెందిన జిలానీ అలియాస్ సిద్దిక్‌తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తాను సింగర్, యాంకర్‌గా పనిచేస్తున్నట్లు ఆమె అతడికి తెలిపింది. ఈ క్రమంలో విజయవాడలో తనకు పెట్ షాప్ ఉందని చెప్పిన జిలానీ, షాప్ ప్రమోషన్ కోసం రీల్స్ చేయాలని ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు రూ.30 వేలు పారితోషికం ఇస్తానని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లాడ్జిలో స్పృహ కోల్పోయిన యువతి
గత నెల 20న మంగళగిరికి రావాలని జిలానీ కోరడంతో యువతి అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. స్థానిక లాడ్జిలోని ఓ గదిలో ఉండాలని సూచించగా, ఆమె అక్కడ వేచి ఉన్న సమయంలో జిలానీ మంచినీరు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ నీరు తాగిన తర్వాత స్పృహ కోల్పోయిన తనను వివస్త్రను చేసి ఫొటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఆరోపించింది.
సుమారు మూడు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన తనను ఆ ఫొటోలు, వీడియోలు చూపించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన ఫోన్ ద్వారా రూ.16 వేల నగదును ఫోన్‌పే చేయించుకున్నాడని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.
కడప పోలీసులకు ఫిర్యాదు.. మంగళగిరికి కేసు బదిలీ
మరుసటి రోజు లాడ్జి నుంచి బయటకు వచ్చిన యువతి తన స్వగ్రామమైన కడపకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా నిందితుడి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఈ నెల 24న కడప పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఘటన మంగళగిరి పరిధిలో జరగడంతో కడప పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తదుపరి దర్యాప్తు కోసం మంగళగిరి పట్టణ పోలీసులకు బదిలీ చేసినట్లు సమాచారం.
లాడ్జి సీసీటీవీ ఫుటేజీపై దర్యాప్తు
కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాధితురాలికి, నిందితుడికి గతంలో ఏవైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. లాడ్జి నిర్వాహకులను విచారించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు న్యాయస్థానంలో నిరూపితమయ్యే వరకు వాటిని ఆరోపణలుగానే పరిగణించాలి.
Y7 News Telugu | ప్రజల గొంతుక








