ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఎల్ నినో’ అసాధారణ రీతిలో బలపడి, ‘సూపర్ డూపర్ ఎల్ నినో’గా మారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది 1950 తర్వాత సంభవించిన అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నిలిచిపోవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా వేసింది. మానవ ప్రేరిత వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఇది మరింత తీవ్రతరం చేస్తుందని వెల్లడించింది.
పసిఫిక్ మహాసముద్రం భారీ ఎత్తున ఉష్ణాన్ని విడుదల చేస్తుండటంతో భూగోళంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయి. వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాయే విడుదల చేసిన గ్లోబల్ క్లైమేట్ మ్యాప్‌లో, అమెరికా మినహా భూమి దాదాపు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తోంది. ఎల్ నినో ప్రస్తుతం గరిష్ఠ శక్తితో కొనసాగుతోందని, దీని ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.4°C ఎక్కువగా నమోదయ్యాయని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని మరో వాతావరణ శాస్త్రవేత్త జీక్ హాస్‌ఫాదర్ తెలిపారు.
2026 చివరి నాటికి మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రికార్డు స్థాయిలో 3.7°C మేర పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి నాటికి దాదాపు 4,51,000 అదనపు మరణాలు సంభవించే ప్రమాదముందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి సంభవించే ఎల్ నినో, ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచడంతో పాటు వర్షపాత గమనంలోనూ భారీ మార్పులకు కారణమవుతుంది.








