ప్రజాప్రతినిధి ద్వంద్వ వైఖరిపై భగ్గుమంటున్న ఆదివాసీ సమాజం
భద్రాద్రి జిల్లా (ప్రత్యేక ప్రతినిధి)
ఆదివాసీ రిజర్వేషన్‌తో పదవులు అనుభవిస్తూ, సొంత సమాజం సమస్యలపై నడిరోడ్డున పడి అల్లాడుతుంటే కనీసం పలకరించని ప్రజాప్రతినిధి, పార్టీ అగ్రనేత అరెస్ట్ కాగానే రోడ్డుపైకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేపట్టడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రజాద్రోహమేనని ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి.
*గెలిపించిన సమాజం రోడ్డెక్కితే కనిపించని ఆవేదన*
ఆదివాసీ సమాజంలో పుట్టి పెరిగి, వారి అండదండలతో, వారి రిజర్వేషన్ పుణ్యమా అని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సదరు నాయకుడికి తమ జాతి సమస్యలు ఏనాడూ పట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధమైన హక్కులు, అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు రోడ్డెక్కి గొంతు చించుకున్నప్పుడు కనీసం సంఘీభావం తెలపడానికి రాని ఈ ప్రజాప్రతినిధి, ఇప్పుడు ఎవరి మెప్పు కోసం రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
*పార్టీ భక్తి ముందు జాతి సంక్షేమం బలాదూర్*
సీజన్‌కో పార్టీ మారుతూ, అధికారం ఎక్కడుంటే అక్కడికి వాలిపోయే ఈ నాయకుడికి ప్రజా సమస్యల కన్నా రాజకీయ లబ్ధే ముఖ్యమైపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం, అగ్రనేతల అరెస్టులపై ఉన్న శ్రద్ధ… ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు, అమలవుతున్న చట్టాలపై ఎందుకు లేదని సంఘాల నాయకులు వాపోతున్నారు. స్వార్థ రాజకీయాలు, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే తాపత్రయంలో తనను గెలిపించిన ఆదివాసీ సమాజాన్ని విస్మరించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కల్లబొల్లి హామీలతో మభ్యపెట్టే యత్నాలు:
మరోవైపు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తీరిక లేని నాయకులు, రాజకీయ డ్రామాలకు మాత్రం ముందుంటారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఓట్లేసి గెలిపించిన ఆదివాసీలకు అన్యాయం జరిగితే నోరు మెదపని నాయకుడు, అధిష్టానం పిలుపునివ్వగానే ప్లకార్డులు పట్టుకుని రోడ్లమీద నిలబడటం సిగ్గుచేటని ఆదివాసి సమాజం బగ్గుమంటింది.ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి వీడి, ఆదివాసీ సమాజ హక్కుల పరిరక్షణకు ఏం చేశారో సమాధానం చెప్పాలి” అని ఆదివాసీ సంఘాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.









