శ్రీకాకుళం జిల్లా, పలాస, సెప్టెంబర్ 15 (వై7 న్యూస్):
విశాఖపట్నంలో జరుగుతున్న ఆర్మీ నియామక ప్రక్రియలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన యువకుడు శేషగిరిరావు ఆర్మీ సెలక్షన్‌కు హాజరై అస్వస్థతకు గురై మృతి చెందాడు.
సమాచారం మేరకు, శేషగిరిరావు సోమవారం రాత్రి ఆర్మీ సెలక్షన్ నిమిత్తం విశాఖపట్నం వెళ్లాడు. బీచ్ రోడ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియలో అధికారులు అభ్యర్థులను పరీక్షిస్తున్న సమయంలో అతను ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
వెంటనే అధికారులు అతడిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ శేషగిరిరావు మృతి చెందినట్లు విశాఖ 3 టౌన్ పోలీసులు ధృవీకరించారు.
యువకుడి ఆకస్మిక మరణ వార్త పలాస ప్రాంతంలో విషాదాన్ని నింపింది. మృతికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టగా, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








