భద్రాచలం | సెప్టెంబర్ 15
భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది. పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి మధ్య 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై భద్రాచలంలో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉందన్నారు. గతంలో పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను కోరగా, ప్రస్తుతం పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 173.61 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు కావడం శుభపరిణామమన్నారు.
సుమారు రూ.2,864 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును 2031 నాటికి పూర్తి చేసేలా ప్రతిపాదించినట్లు తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం జరగనుండటం ఈ ప్రాజెక్టులో కీలక అంశమన్నారు.
రైల్వే కనెక్టివిటీతో దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవకాశాల అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రాజెక్టు మంజూరైన నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు అవసరమైన భూమిని అప్పగించాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతిబాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.








