కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించడానికి పెద్ద పెద్ద సంభాషణలు అవసరం లేదు. పాత్రల భావోద్వేగాలు, సందర్భం చాలు.. మనసును తాకుతాయి. అలాంటి సన్నివేశాల్లో ‘స్వాతిముత్యం’లో అమ్మమ్మ మరణించే సీన్ ఒకటి. చుట్టూ ఉన్నవారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నా.. కథానాయకుడికి మాత్రం అసలు ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాదు.
ఈ సన్నివేశంలో కథానాయకుడి అమాయకత్వాన్ని దర్శకుడు ఎంతో సహజంగా చూపించాడు. విషాదాన్ని బలవంతంగా రుద్దేలా పెద్ద పెద్ద డైలాగులు లేకుండా.. చుట్టూ ఉన్న పాత్రల స్పందనలతోనే పరిస్థితి తీవ్రతను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశారు. అదే సమయంలో కథానాయకుడి అమాయకమైన ప్రవర్తన ఆ సన్నివేశానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
చివర్లో కథానాయకుడు చెప్పే ఒక్క మాట మాత్రం మొత్తం సన్నివేశానికి మరో అర్థాన్ని తీసుకొస్తుంది. విషాద పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేని అతని అమాయకత్వం ప్రేక్షకుల్లో నవ్వు, బాధ రెండింటినీ ఒకేసారి కలిగిస్తుంది. అందుకే ‘స్వాతిముత్యం’లోని ఈ సన్నివేశం ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది.









