E-PAPER

బ్యాంకుల్లో భారీగా నగదు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం..!

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు నగదు రికార్డు స్థాయికి చేరింది. దీంతో దీన్ని నియంత్రించేందుకు ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌బీఐ) కీలక చర్యకు సిద్ధమైంది. సోమవారం రూ.ఏడు లక్షల కోట్లను 30 రోజుల పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకునేందుకు ‘వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో’ వేలం నిర్వహించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల నిర్వహించిన లిక్విడిటీ ఆపరేషన్లతో పోలిస్తే ఇది ఎక్కువ కాలం ఉండే చర్య. గతంలో గరిష్ఠంగా 15 రోజుల వరకు మిగులు నగదును తీసుకునేలా వేలం నిర్వహించారు. ఇప్పుడు 30 రోజుల పాటు నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచే అవకాశం ఉంది. దీంతో స్వల్పకాలిక మనీ మార్కెట్‌పై కేంద్ర బ్యాంకుకు మరింత నియంత్రణ లభించనుంది.

ప్రస్తుతం దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు రూ.10.5 లక్షల కోట్ల మిగులు నగదు ఉన్నట్లు అంచనా. విదేశాల్లో ఉన్న భారతీయులు బ్యాంకుల్లో భారీగా డాలర్‌ డిపాజిట్లు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ విదేశీ కరెన్సీని ఆర్‌బీఐ రూపాయల్లోకి మార్చడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి పెద్ద మొత్తంలో నగదు వచ్చింది.

విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి డాలర్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన పథకం భారీగా విజయవంతమైంది. ఆగస్టులో పథకం ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 127 బిలియన్‌ డాలర్లు సమీకరించారు. నిర్ణీత గడువు కంటే నెల ముందుగానే ఈ పథకాన్ని ముగించారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలకు కల్పించిన ఇతర రుణ సదుపాయాలతో కలిపి ఆర్థిక వ్యవస్థలోకి దాదాపు 136.4 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.

భారీగా నగదు రావడం వల్ల బ్యాంకుల మధ్య రాత్రికి రాత్రి జరిగే రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం వెయిటెడ్‌ యావరేజ్‌ కాల్‌ రేట్‌ ఆర్‌బీఐ పాలసీ రేటు కంటే దిగువకు చేరింది. మిగులు నగదును క్రమంగా వెనక్కి తీసుకుంటూ మార్కెట్లపై ప్రభావం పడకుండా చూడటం ఇప్పుడు ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలుగా మారింది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!