సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలోని అబ్బా సమీపంలో ఉన్న ఓ చిన్న బంగారు గని మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. రెడ్‌క్రాస్ సమాచారం ప్రకారం.. తొలుత ఈ ఘటనలో 30 మంది మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య 100 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి చేతులతోనే బురద, మట్టి, శిథిలాలను తొలగించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. గని కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.








