భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గురువారం ఇరు దేశాలు రెండు అవగాహన ఒప్పందాలు, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నాయి. ఈ ఒప్పందాలు పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారానికి మరింత ఊతం ఇవ్వనున్నాయి.
ముఖ్యంగా ఆహార భద్రత, సముద్ర వారసత్వం, టెలికమ్యూనికేషన్స్, ప్రసార నియంత్రణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాలను పరస్పరం పంచుకోవడంతో పాటు ఆయా రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి.
అలాగే అధునాతన తయారీ, డిజిటలైజేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ తాజా ఒప్పందాలతో భారత్–సింగపూర్ మధ్య ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.









