కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత ప్రయాణం త్వరలో పుస్తక రూపంలో పాఠకుల ముందుకు రానుంది. ఆమె రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో 544 పేజీల ఆత్మకథ నవంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ స్పందన చేశారు.
రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని రాహుల్ గాంధీ తన తల్లి ధైర్యాన్ని కొనియాడారు. రాజీవ్ గాంధీని చివరిసారిగా కలిసి 35 ఏళ్లకు పైగా గడిచిందని పేర్కొంటూ.. ఆయన మరణం తర్వాత సోనియా గాంధీ ప్రతి సవాలును ఎంతో ధైర్యంగా, గౌరవంగా ఎదుర్కొన్నారని అన్నారు. తల్లి పడిన కష్టాలు తనకు, ప్రియాంకకు మాత్రమే తెలుసని రాహుల్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
తన జీవిత కథను ప్రపంచంతో పంచుకోవడం సోనియా గాంధీకి ఎంత కష్టమో తాను అర్థం చేసుకోగలనని రాహుల్ అన్నారు. ఈ రోజు పైనున్న తన తండ్రి రాజీవ్ గాంధీ.. తన అందమైన సోనియాను చూసి తప్పకుండా గర్వంగా నవ్వుతూ ఉంటారని పేర్కొన్నారు. రాహుల్ చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.








