శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్
పలాస: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న మెస్ చార్జీలను పెంచి, నాణ్యమైన ఆహారం అందించాలని PDSU డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం PDSU ఆధ్వర్యంలో పలాస ఆర్డీవో అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 10 శాతం మెస్ చార్జీల పెంపు సరిపోదని పేర్కొన్నారు.
విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు మెస్ చార్జీలను కనీసం 49 శాతం పెంచి, ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించాలని PDSU డిమాండ్ చేసింది.
అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారికి నాణ్యమైన ఆహారం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని PDSU నాయకులు విజ్ఞప్తి చేశారు.








