E-PAPER

వరుస చైన్ స్నాచింగ్‌లకు చెక్.. 8 మంది అరెస్ట్

భద్రాద్రి జిల్లాలో రూ.26 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం.. ప్రధాన నిందితుడిపై 83 కేసులు

కొత్తగూడెం, ఆగస్టు 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ముఠాకు చెందిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న ఆరు బంగారు గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చోరీ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను గుర్తించి అరెస్ట్ చేశారు.

రాత్రివేళ ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలే లక్ష్యం

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు అలియాస్ నాగేంద్ర తన సహచరులతో కలిసి రాత్రివేళ ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. మహిళల మెడలోని బంగారు గొలుసులను ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో కట్ చేసి క్షణాల్లో అపహరించేవారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి పరారయ్యేవారు.

కొన్ని సందర్భాల్లో ముందుగానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటినే తదుపరి నేరాలకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా, ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

10 కేసుల్లో కీలక ఆధారాలు

నిందితుల విచారణలో దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 10 కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు (35), అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనిపై అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, బూర్గంపాడు, పాల్వంచ, భద్రాచలం, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 83 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అతనితో పాటు వల్లూరి శాంతరాజు అలియాస్ రాజు, ఉకే భద్రం అలియాస్ వీరభద్రం, బెత్తి కార్తిక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మ అలియాస్ సర్లమ్మలను అరెస్ట్ చేశారు. వీరిలో వల్లూరి శాంతరాజుపై 11, ఊర లింగయ్యపై 12 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అంతర్రాష్ట్ర నేరస్తుడి కోసం గాలింపు

ఈ కేసుల్లో మరో నిందితుడైన తమ్మిశెట్టి బాలవీరస్వామి (50), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడిని అంతర్రాష్ట్ర నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

చోరీ చేసిన వాహనాలతోనే వరుస నేరాలు

దర్యాప్తులో భాగంగా దమ్మపేట పరిధిలోని పార్కలగండి ప్రాంతంలో వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు నానుతాడు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బూర్గంపాడు, పాల్వంచ రూరల్ పరిధుల్లో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు.

ఆ వాహనాలను ఉపయోగించి బూర్గంపాడు, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాయిగూడెం కేసులో ప్రధాన నిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర కేసుల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కేసుల దర్యాప్తులో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రాజేశ్ కుమార్, యయాతి రాజు, బాలస్వామినాధం, దేవ్ సింగ్, హెచ్‌సీ ప్రసాద్, పీసీలు వెంకట్, ధర్మారావు, లక్ష్మయ్య, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, నరసింహారావు, డబ్ల్యూపీసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!