ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది గోధుమ చపాతీలకు బదులుగా చిరుధాన్యాలతో తయారైన ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే కారణంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. అయితే జొన్న రొట్టెలు తయారు చేసే సమయంలో పిండి విరిగిపోవడం, రొట్టె సరిగా ఒత్తుకోలేకపోవడం, పెనంపై పొంగకపోవడం లేదా కాల్చిన తర్వాత గట్టిగా మారిపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ సమస్యకు సులభమైన కిచెన్ ట్రిక్ ఉంది. ముందుగా స్టవ్‌పై ఒక పాత్రలో పావు కప్పు నీరు పోసి, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. ఆ తర్వాత దాదాపు ఒకటిన్నర కప్పుల జొన్న పిండి వేసి తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ ఉండాలి. పిండి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మరో పాత్రలోకి తీసి కొద్దిగా చల్లారనివ్వాలి.
తర్వాత ఆ పిండిని చేతులతో బాగా మృదువుగా కలిపి రొట్టెలుగా ఒత్తి కాల్చితే అవి మెత్తగా, చక్కగా పొంగుతాయి. ఇలా ముందుగా వేడి నీటితో పిండిని ఉడికించి సిద్ధం చేయడం వల్ల రొట్టెలు విరిగిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువసేపు మెత్తదనాన్ని కూడా నిలుపుకుంటాయి. దీంతో జొన్న రొట్టెలను రుచిగా, సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.









