కరకగూడెం, ఆగస్టు 8 (వై7 తెలుగు న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో అధిక సంఖ్యలో సంచరిస్తున్న ఇసుక లారీల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోలీసులు స్పందించారు. కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు శనివారం ఇసుక లారీలను అడ్డుకుని డ్రైవర్లకు సూచనలు జారీ చేశారు.
వరంగల్ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలు ములుగు, ఏటూరునాగారం, జానంపేట, పినపాక మార్గంలో ప్రయాణించాల్సి ఉండగా, కొంతమంది డ్రైవర్లు తాడ్వాయి–వై జంక్షన్ మీదుగా కరకగూడెం రహదారిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు, దుమ్ము కాలుష్యం, రహదారి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడెం మీదుగా వెళ్తున్న ఇసుక లారీలను నిలిపివేసి, నిర్ణయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఈ రూట్లో రాకూడదని డ్రైవర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
స్థానికులు పోలీసుల చర్యను స్వాగతిస్తూ, గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన ఎస్సైకు కృతజ్ఞతలు తెలిపారు.








