చాలామంది పాదాల వాపును చిన్న విషయంగా భావిస్తారు. పైగా ఈ వాపునకు చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువగా నడవడం, ఎక్కువసేపు నిలబడటం లేదా సరిపోని బూట్ల వేసుకోవడం వల్ల వస్తుందని అనుకుంటారు. ఇవి చాలా సాధారణ కారణాలే అయినప్పటికీ.. పాదాల వాపు తరచుగా వస్తూ.. ఎక్కువ కాలం కొనసాగితే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది అంతర్గతంగా ఉన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని అంటున్నారు.
కాళ్ల వాపును వైద్యపరంగా ఎడిమా అంటారు. దీని అర్థం శరీర కణజాలాలలో అదనపు ద్రవం పేరుకుపోవడమే. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ లేదా అవయవాలు సరిగ్గా పనిచేయనప్పుడు.. గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగడం వల్ల ఈ ద్రవం కాళ్లు, చీలమండలలో పేరుకుపోతుంది. శరీరంలో ఏదో తప్పు జరుగుతుందని శరీరం ఇచ్చే హెచ్చరికల్లో ఇది కూడా ఒకటి కావచ్చు అని వైద్యులు చెప్తున్నారు. మరి ఇది ఎందుకు ప్రమాదమో.. పాదాల్లో వాపునకు అంతర్గత కారణాలు ఏవి కావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం








