ఒక కప్పు మాచా టీ తయారు చేసుకోవడానికి ఒక టీస్పూన్ కంటే తక్కువ.. సుమారు 1 నుంచి 2 గ్రాముల మ్యాచా పొడిని తీసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు నీటిని వేడి చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో మ్యాచా పొడి వేసి కొద్దిగా వేడి నీరు పోయాలి. ఉండలు లేకుండా నీటిని బాగా కలపాలి. ఆ తర్వాత మిగిలిన నీటిని పోసి కలిపితే మాచా టీ రెడీ. కావాలంటే రుచికోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
మాచాలో కాటెచిన్స్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీనిలో కెఫీన్‌తో పాటు L-theanine కూడా ఉంటుంది. ఇది ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే మరికొన్ని పరిశోధనల్లో గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సానుకూల ప్రభావాలు కనిపించాయి. అందుకే సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
గ్రీన్ టీ, కాటెచిన్స్, కెఫీన్పై జరిగిన కొన్ని అధ్యయనాలు శరీర శక్తి వినియోగం, కొవ్వు ఆక్సీకరణపై స్వల్ప ప్రభావం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే మాచా తాగితేనే బరువు తగ్గిపోతామని అనుకోకూడదు. బరువు తగ్గడానికి ఆహారం, శారీరక శ్రమ, నిద్ర వంటి అనేక అంశాలు హెల్ప్ చేస్తాయి. అలాగే మాచాను నీటితో మాత్రమే తీసుకుంటే అదనపు చక్కెర ఉండదు. కాబట్టి తక్కువ కేలరీ డ్రింక్స్‌లో భాగంగా దీనిని తీసుకోవచ్చు. ..
కెఫీన్ ఎక్కువగా ఉంది కాబట్టి.. ఎక్కువగా తాగడం మంచిది కాదు. అలాగే దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. కానీ సాయంత్రం, రాత్రుళ్లు తీసుకుంటే దీనిలోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.








