E-PAPER

భూములు కబ్జా చేస్తున్న నాన్-ట్రైబల్స్‌పై ఎల్ టి ఆర్ పి కేసులు తప్పవు: ASP హెచ్చరిక

1/70 చట్టం పై సవాల్ విసురుతున్న వారిపై జాలి చూపించాల్సిన అవసరం లేదు

నాన్-ట్రైబల్స్ అక్రమ కట్టడాలు, స్థిర నివాసాలపై ఆదివాసులంతా మూకుమ్మడిగా కేసులు పెట్టాలి

ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపు

రంపచోడవరం, (వై7 న్యూస్) జూలై 30: పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల అమాయకత్వాన్ని, మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని భూములను కబ్జా చేస్తూ, తిరిగి ఆదివాసులపైనే పెత్తనం చెలాయించాలని చూస్తున్న నాన్-ట్రైబల్స్‌పై LTRp (భూబదిలీ నిషేధ చట్టం) కేసులు నమోదు చేయడం తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హెచ్చరించారు. గురువారం రోజున రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC) కోర్టులో ఆదివాసుల తరఫున వివిధ ఎల్ టి ఆర్ పి కేసుల విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కుంజా శ్రీను మాట్లాడుతూ — బ్రతుకుదెరువు కోసం ఏజెన్సీకి వచ్చిన కొందరు నాన్-ట్రైబల్స్ ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా, ఏకంగా దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టులో ఆదివాసీ చట్టాలనే సవాల్ చేయడం దారుణమన్నారు. మన తండ్రులు, తాతలు జాలి చూపించడం వల్లే ఈరోజు వలస వచ్చిన నాన్-ట్రైబల్స్ ఏజెన్సీలో ఆదివాసులకు భూములు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భూభాగ రక్షణ కోసం రూపొందించిన 1/70 చట్టాన్నే రద్దు చేయాలని సుప్రీంకోర్టు మెట్లెక్కిన నాన్-ట్రైబల్స్‌పై ఇక ఎంతమాత్రమూ జాలి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆదివాసుల భూములను కౌలు పేరుతో తీసుకుని పి శాశ్వత పట్టాలుగా మార్చుకున్న వారిపై, దౌర్జన్యంగా బెదిరించి కబ్జాలు చేసిన వారిపై, అలాగే ప్రభుత్వ ఆర్ అండ్ బి (R&B), పంచాయతీ మరియు ఆదివాసీ భూములను ఆక్రమించి స్థిర నివాసాలు, వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క నాన్-ట్రైబల్‌ పై ఆదివాసులందరూ మూకుమ్మడిగా ఎల్ టి ఆర్పి కేసులు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. భూకబ్జాలను నిలదీస్తున్న ఆదివాసులపై బెదిరింపులకు దిగుతూ, తప్పుడు కేసులు బనాయిస్తున్న చర్యలను సహించేది లేదని, ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రంలోనూ ఉన్న అక్రమ కట్టడాలపై చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఏజెన్సీ ప్రాంతంలో చట్టప్రకారం 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందిందని, ముఖ్యంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసులు ఎవరైనా భూసమస్యలు ఉంటే వెంటనే సంక్షేమ పరిషత్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, బాధితులు కాలింకోట శ్రీనివాస్, శారదా దేవి, అన్నిక శ్రీను, పొడియం అశోక్, సోందే లక్ష్మణ్ మరియు, బాధితులైన ఆదివాసీలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News