రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, విద్యా శాఖల పనితీరును సమీక్షించారు. తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంటల వైవిధ్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు కాలానుగుణ వ్యాధుల నివారణపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. పారిశుధ్యం, దోమల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షిత తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యా రంగంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటశాలల కోసం అనువైన స్థలాలను గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా గుర్తించిన అన్ని అంశాలను జిల్లా కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, నిరంతర సమీక్షలు నిర్వహించాలని సంజయ్ జాజు ఆదేశించారు.









