E-PAPER

మహిళలే టార్గెట్.. పూండిలో వరుస చైన్ స్నాచింగ్‌లు

పలాస, జూన్ 27 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పూండి గ్రామంలో వరుసగా రెండు రోజుల వ్యవధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులకు పాల్పడుతూ సుమారు 7.5 తులాల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం.

గురువారం సాయంత్రం పూండి–పీఎంపురం రోడ్డులో నివాసముంటున్న కోట లక్ష్మి ఇంటి ముందు పూలు కోస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలో ఆమెను తోసివేయడంతో స్వల్ప గాయాలయ్యాయి.

అదే తరహాలో శుక్రవారం మధ్యాహ్నం పూండి కర్రెమ్మ వీధిలో దున్న జగదీశ్వరిపై దుండగుడు దాడి చేశాడు. బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమెను బలంగా నెట్టి, మెడలో ఉన్న సుమారు 55 గ్రాముల (దాదాపు 4.5 తులాలు) బంగారు పుస్తెలతాడును అపహరించి పారిపోయాడు. స్పృహ కోల్పోయిన జగదీశ్వరిని కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స అందించారు.

సమాచారం అందుకున్న వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి. నిహార్ సంఘటన స్థలాలను పరిశీలించి పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలతో పూండి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళలతో పాటు పగటి సమయంలో కూడా పోలీసు పహారా పెంచాలని కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News