కొత్తగూడెం, జూన్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరైన అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు.
కొత్తగూడెంలో జరిగిన సేవాలాల్ సేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు తదితరాల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఎస్ఈ పేరుతో ప్రచారం చేసుకుంటూ అనుమతులు లేకుండానే కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయని ఆరోపించిన ఆయన, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనుమతులు లేని పాఠశాలలను వెంటనే సీజ్ చేయకపోతే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సేవాలాల్ సేన నాయకులు లావుడియా వెంకటేష్ నాయక్, బానోతు నాగరాజు నాయక్, జరపల లాలు నాయక్, పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.








