భద్రాచలం, జూన్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లపై ఎస్సీ డీడీ శ్రీలత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వాటిని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు.
భద్రాచలంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్ వర్కర్లకు 16 నెలలుగా వేతనాలు చెల్లించకపోగా, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందుకు కొందరిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు లేదా అధికారిక ఉత్తర్వులు లేకుండానే విధులు నిలిపివేయడం, బదిలీలు చేయడం, విధులకు సంబంధం లేని పనులు అప్పగించడం జరుగుతోందన్నారు.
తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేసి, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పీవోడబ్ల్యూ నాయకురాలు మడకం సమ్మక్క, పీవైఎల్ నాయకులు మట్ట నరసింహరావు, కారం జైరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.








