పలాస, జూన్ 26 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రయి గేట్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రూరల్ సీఐ ఎం. తిరుపతి, ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల తనిఖీల సందర్భంగా స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో అతని వద్ద 9 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతను మహారాష్ట్రకు చెందిన శ్రీరాంగా గుర్తించామని, కొంతకాలంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి గంజాయిని తరలిస్తుండగా పట్టుబడినట్లు పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించిన పోలీసులు, నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గంజాయి రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.








