తమిళనాడు అసెంబ్లీలో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే), ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వేసిన “మీ నాన్న ఎక్కడ?” అనే సెటైర్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. సభలో విజయ్ ఒక పిట్టకథ చెబుతూ.. ఒక చిన్న పిల్లాడిని చూసి వృద్ధుడు ‘మీ నాన్న కోసం వెతుకుతున్నాను, ఆయన ఎక్కడ?’ అని అడిగినట్లుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ కొలత్తూర్ స్థానం నుంచి అనూహ్యంగా ఓడిపోయి సభకు దూరం కావడాన్ని ఉద్దేశించే విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోంది.
సీఎం విజయ్ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలపై డీఎంకే నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం స్టాలిన్ స్వయంగా స్పందిస్తూ.. “నేను అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ నా ప్రజల గుండెల్లోనే ఉంటాను” అని విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తమ నాయకుడు ఎక్కడ అని విజయ్ అడిగారని, అతి త్వరలోనే స్టాలిన్ ఉప ఎన్నికల ద్వారా మళ్లీ అసెంబ్లీలోకి గర్వంగా అడుగుపెట్టి తన బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ఆయన సవాల్ విసిరారు.
అయితే, ఈ రాజకీయ రగడ క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయ్ వ్యాఖ్యలకు ప్రతిగా ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. “చెంగల్పట్టు కోర్టులో ఒక భార్య తన భర్త కోసం వెతుకుతోంది” అంటూ సీఎం విజయ్ విడాకుల వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వివాదాస్పద పోస్ట్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాలను మరొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంపై రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.








