భద్రాచలం, ఏప్రిల్ 6:
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. డయాలసిస్ పేషెంట్‌గా చికిత్స పొందుతున్న మహిళ ప్రాణాపాయ స్థితికి చేరిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ముసలమడుగు గ్రామ పంచాయతీకి చెందిన మేకల సీతమ్మ కొంతకాలంగా డయాలసిస్ చికిత్స పొందుతోంది. ఆమె ప్రతి రెండు రోజులకోసారి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం కూడా సాధారణంగా ఆసుపత్రికి వెళ్లింది.
చికిత్స సమయంలో సీతమ్మకు రక్తం తక్కువగా ఉందని వైద్య సిబ్బంది గుర్తించారు. దాంతో రక్తం ఎక్కించే ప్రక్రియను ప్రారంభించారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఉపయోగించే పైపు అకస్మాత్తుగా తెగిపోవడంతో రక్తం బయటకు కారడం ప్రారంభమైంది.
అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే గమనించకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. సమాచారం ప్రకారం సుమారు రెండు గంటల పాటు రక్తం బయటకు కారినట్లు తెలుస్తోంది. దీంతో సీతమ్మ శరీరంలో రక్తం గణనీయంగా తగ్గిపోయి ఆమె ప్రాణాపాయ స్థితికి చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతోంది.ఈ ఘటనపై సీతమ్మ భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగానే తన భార్య ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక ఈ ఘటనపై స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే పేద ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై వైద్యాధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.









