అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ టెక్ సపోర్ట్, బెదిరింపులు, క్రిప్టోకరెన్సీ ర్యాన్సమ్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఛేదించింది. పంజాబ్, ఢిల్లీ కేంద్రాలుగా నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న ఈ సిండికేట్ ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురు సహచరులను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు బాధితుల కంప్యూటర్లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల పేరుతో నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లు చూపించి, వాటికి కాల్ చేసిన వారిని టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి భారీ మొత్తాలు వసూలు చేసినట్లు వెల్లడైంది.
అంతేకాకుండా, బాధితులపై చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయని భయపెట్టి, క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బిట్‌కాయిన్ రూపంలో ర్యాన్సమ్ చెల్లించేలా ఒత్తిడి చేసినట్లు సీబీఐ తెలిపింది. ఇలా సేకరించిన నిధులను అంతర్జాతీయ క్రిప్టో వాలెట్లకు మళ్లించి, ఢిల్లీలోని ఆపరేటర్ల సహాయంతో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఈ కేసులో భాగంగా ఆగస్టు 5, 6 తేదీల్లో పంజాబ్‌లోని మొహాలీ, ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో 20కి పైగా మొబైల్ ఫోన్లు, 15 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, భారీ మొత్తంలో నగదు, క్రిప్టో వాలెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ముఠా మోసాలకు అమెరికాలోని ఫ్లోరిడా, న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందిన మహిళలు లక్షల డాలర్లు కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు, అంతర్జాతీయ స్థాయిలో ఈ నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








