కొత్తగూడెం రీజియన్ ఇంచార్జ్ కాజీపేట కృష్ణ పిలుపు
మణుగూరు, జూలై 23 (వై7 న్యూస్):
ఈ నెల 25వ తేదీన గోదావరిఖనిలోని ఆర్కే గార్డెన్స్ వేదికగా సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, అణగారిన వర్గాల హక్కుల కోసం అప్రతిహతంగా పోరాడిన మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ కి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి మాదిగ అనుబంధ సంఘాల నేతలు, సింగరేణి మాదిగ ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కొత్తగూడెం రీజియన్ ఇంచార్జ్ కాజీపేట కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన, పద్మశ్రీ అవార్డు పొందిన మంద కృష్ణ మాదిగ దళిత సమాజం కోసం చేసిన పోరాటం ఎవరికీ తెలియనిది కాదు. రెండు దశాబ్దాల క్రితమే ఆయన సింగరేణిలో పర్యటించి మాదిగ ఉద్యోగుల సమస్యలను స్వయంగా అధ్యయనం చేశారు. ఆయన ఆదేశంతోనే ఈ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశాం. బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు ఆయన చేసిన భరోసా యాత్ర మాదిగ ఉద్యోగులకు నైతిక బలం ఇచ్చింది అన్నారు.
ఈ సన్మాన సభ ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని ఆర్కే గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. కార్యక్రమాన్ని అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గప్రసాద్, అధ్యక్షులు బొంకూరి మోహన్ సమన్వయంతో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో మాదిగ సంఘ నాయకులు, ఉద్యోగులు అందరూ సంఘీభావంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాజీపేట కృష్ణ కోరారు. ఇది కేవలం సన్మాన కార్యక్రమం మాత్రమే కాదు. ఇది మన హక్కుల సాధనలో మరో ఘట్టం. అందుకే ప్రతి మాదిగ అనుబంధ సంఘం నాయకుడు ఛలో గోదావరిఖని పిలుపుని గౌరవంగా తీసుకుని పాల్గొనాలి అని ఆయన అన్నారు.