మణుగూరు,మే20 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని రాజుపేట గ్రామం అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా మారిన ఈ గ్రామంలో ప్రజలు దమ్ము, ధూళి, బాంబుల శబ్దాలతో రోజువారీగా ఉలిక్కిపడుతున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నేడు రాజుపేట గ్రామాన్ని సందర్శించారు. స్థానికుల సమస్యలను స్వయంగా విన్న కలెక్టర్… గ్రామంలోని బీటలు వారిన ఇండ్లను స్వయంగా పరిశీలించారు. అధికారులను ఉద్దేశించి – “సైడ్ డ్రైనేజీలు, వీధిలైట్లు పెట్టడం కాదు… ఇక్కడ అవసరమైన రహదారులు నిర్మించడంపై దృష్టి పెట్టాలి” అని పేర్కొన్నారు.ఈ పర్యటనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య కూడా కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాజుపేట చెరువును పరిశీలించిన అధికారులు… ఈ చెరువు కింద రైతులు సాగుచేసుకుంటున్నారని, మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని తెలుసుకున్నారు.అయితే, ఈ చెరువు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములకు ప్యాకేజీ ఇవ్వనున్న సింగరేణి… ఇండ్ల విషయంలో మాత్రం ప్యాకేజీలు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు.ఈ అంశాలపై పూర్తిస్థాయి నివేదికను సింగరేణి అధికారులు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థులు తమ సమస్యలకు త్వరిత పరిష్కారాన్ని ఆశిస్తున్నారు.