డబుల్ బెడ్రూం ఇల్లు, నెలకు కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి
“ప్రతి అమావాస్య మాకు పున్నమే” కార్యక్రమం
జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ
హైదరాబాద్,డిసెంబర్01 వై 7న్యూస్
రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇల్లు లేదా 250 గజాల ఇంటి స్థలం, నెలకు కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కార్మికులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది సంబరాలు చేసుకుంటున్నారని, కానీ అసంఘటిత, భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు మాత్రం కాంగ్రెస్ పాలనలో అనేక బాధలు పడుతున్నారని ఆయన అన్నారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్లోని రాంనగర్ ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన”ప్రతి అమావాస్య మాకు పున్నమే” అనే కార్యక్రమంలో భాగంగా కార్మిక నాయకులతో కేఎస్ఆర్ గౌడ పలు అంశాలపై చర్చించారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్, న్యూ అభయ సెంట్రింగ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కడెం నర్సింహా, యూనియన్ నాయకులు టి. వాసుదేవ్, ఎ.బి.షమీమ్, ఇ. సదానంద్, ఎం. యాదగిరి, మండల నర్సింహా, బండారి నారాయణ, అనిమొని రాములు, జి. చిన్నయ్య, ఎ. శ్రీనివాసులు, కె. రవీందర్, జి. నిరంజన్, జి. నర్సింగరావు, ఎం. లక్ష్మీ నారాయణ, పి. కరుణాకర్, సి. రాములు, బి. సుమన్ తదితరులు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని కేఎస్ఆర్ గౌడ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉన్న 25 లక్షల భవన నిర్మాణ, అసంఘటిత కార్మికుల అందరికీ తక్షణమే హెల్త్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేఎస్ఆర్ గౌడ డిమాండ్ చేశారు. హెల్త్ క్యాంపుల వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఒరిగేదేమీ లేదని, లేబర్ కమిషన్ నిర్వహించిన ఈ క్యాంపుల పేర ఇప్పటికే వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, ఈ క్యాంపులు కార్మికులకు లేనిపోని బాధలు సృష్టిస్తుంటే, అక్రమార్కులకు జేబులు నింపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న జై స్వరాజ్ పార్టీ చేస్తున్న పోరాటాల్లో పాలుపంచుకోవాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. తాము ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కోసం, నెలకు కనీసం పది రోజుల పని దినాలు కోసం, ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో స్థానిక కార్మికులకు ప్రధమ ప్రాధాన్యం కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నామని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం అన్నారు. ఇప్పటికే అనేక ఏరియా కమిటీలను ఏర్పాటు చేశామని, త్వరలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, కార్మిక పక్షపాతులు తమతో కలిసి రావాలని రత్నం కోరారు. భవన నిర్మాణ కార్మికుల హెల్త్ కార్డులు, ఇల్లు, కనీస పని దినాల కల్పనతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం జై స్వరాజ్ పార్టీ చేసే ఆందోళనల్లో తాము పాల్గొంటామని కడెం నర్సింహా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.