అమరవీరుల సంస్మరణ సభ లో– కర్నాకుల డిమాండ్
కాకినాడ ,నవంబర్ 16 వై7 ప్రతినిధి ;
సామర్లకోటలో అమ్మనమ్మ అపార్ట్మెంట్లలో ఇతర చోట్ల అద్దెలకు నివాసముంటున్న అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మనమ్మ అపార్ట్మెంట్ల వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, పిడిఎస్ యు (విజృంభన) తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం విప్లవోద్యంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ, అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీ ఆర్ సి ఎస్ నాయకులు, కర్నాకుల రామలింగేశ్వరరావు అధ్యక్షతన వహించగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు.అమరవీరుల త్యాగాలను వివరించాను. వారి త్యాగం మరువలేనిదన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించారని కొనియాడారు. సమాజంలో అవినీతి, లంచగొండితనం, వివక్షత, మతోన్మాదం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉండడానికి ఇల్లు లేక ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే, మరోపక్క అధిక ధరల సమస్యను ఎదుర్కొంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. సామర్లకోటలో దశాబ్దాల కాలంగా అమ్మనమ్మ అపార్ట్మెంట్లు ఇతర చోట్ల అద్దెలు భారం తో జీవిస్తున్నారని, రోజంతా చేసిన కూలీ డబ్బులు ఇంటి అద్దెలకే సరిపోతుంటే, పేదలు ఏమి తిని బ్రతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలు జీవితమంతా అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారన్నారు. తక్షణమే మాజీ హోమ్ మినిస్టర్ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకొని వారి చొరవతో ప్రభుత్వం అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారికి నివాస స్థలాలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్ టు యు జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు , పిడిఎస్ యు(విజృంభణ) రాష్ట్ర నాయకులు కడితి సతీష్, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డి నారాయణ మూర్తి, పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య కన్వీనర్ బొచ్చ యేసు, ఏపీ ఆర్ సి ఎస్ నాయకులు దేశెట్టి సురేష్, అప్పారావు, జాను, ఎస్.కె అనుష్క, దుర్గ భవాని, ఏఐఎఫ్టియు నాయకులు కేశవరపువీరన్న, బాబి, బళ్ళ సోమరాజు, లోవరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.