E-PAPER

ఎస్బీఐలో 175కోట్లు మాయం చేసిన సైబర్ నేరగాళ్ళు.. ఎలాగంటే!

రోజురోజుకు దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా దోపిడీకి పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను సునాయాసంగా మాయం చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఎస్బిఐ బ్యాంకు నుండి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన పైన బ్యాంకు ఖాతాదారులు షాక్ కు గురయ్యారు.

బ్యాంకుల ద్వారా సైబర్ నేరగాళ్ళ లావాదేవీలు

సైబర్ నేరగాళ్ళు బ్యాంకులను దోచుకోవటానికి కొత్త పంధా ఎంచుకున్నారు. హైదరాబాద్ షంషీర్ గంజ్ ఎస్బిఐ బ్యాంకులో సైబర్ నేరగాళ్లకు వివిధ ఖాతాల ద్వారా డబ్బులు మళ్లింపు జరిగింది. మొత్తం 175 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు ఎస్బిఐ బ్యాంకులో జరిగినట్టు సైబర్ క్రైమ్ బ్యూరో తాజాగా గుర్తించింది.

నకిలీ ఖాతాలతో లావాదేవీలు ఇద్దరు అరెస్ట్

ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు. మొత్తం 175 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించిన సైబర్ క్రైమ్ బ్యూరో నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టింది. తాజా పరిణామంతో ఎస్బీఐ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ళ కోసం ఖాతాలు తెరిచిన హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ షాహిబ్, బిన్ హమాద్ లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది.

ఆరు అకౌంట్లకు 600 కంపెనీలతో లింకు

మొత్తం ఆరు అకౌంట్ల ద్వారా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించారు.
_ఆరు అకౌంట్లకు 600 కంపెనీలతో లింకు ఉన్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు._ క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బును విదేశాలకు పంపినట్టు, కొంత డబ్బును హవాలా మార్గంలో పంపినట్టు గుర్తించారు. డబ్బుకు ఆశపడి హైదరాబాద్ వాసులు ఈ అకౌంట్ లను తెరిచినట్టు పేర్కొన్నారు.

బ్యాంకులకు పెద్ద సవాల్

175 కోట్ల రూపాయల ఈ భారీ స్కాం పైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. ఇలా ఎన్ని బ్రాంచ్ లలో చేశారు అన్నది కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అరెస్ట్ చేసిన వారి నుండి నగదు బదిలీ జరిగిన ఖాతాలపై కూపీ లాగుతుంది. ఏది ఏమైనా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు బ్యాంకులలోనే చొరబడి తమ దందా నిర్వహించడం బ్యాంకులకు పెద్ద సవాల్ అని చెప్పాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :