E-PAPER

నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం గట్టి వార్నింగ్..! భారత్‌లో ఆ పాకిస్థానీ కంటెంట్ చూపిస్తే ఊరుకోం!

పాకిస్థాన్‌కు చెందిన ఎలాంటి డిజిటల్ కంటెంట్‌ను భారతదేశంలో ప్రసారం చేయవద్దని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మరోసారి ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, భారతీయ వీక్షకులకు పాక్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేత్ లో’ డిసెంబర్‌లో భారత్‌లో విడుదల కానుందనే వార్తలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులు పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ను ప్రసారం చేయరాదంటూ 2025 మే 8న ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం గుర్తుచేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఏ సినిమా లేదా వెబ్ సిరీస్‌ను భారత్‌లోని సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచబోమంటూ 2025 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన లిఖితపూర్వక హామీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఈ వివాదాస్పద పాక్ వెబ్ సిరీస్ ప్రసారంపై మంత్రిత్వ శాఖకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అంతకుముందు ‘ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్’ (ఏఐసీడబ్ల్యూఏ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. ఈ సిరీస్‌ను భారత్‌లో పూర్తిగా నిషేధించాలని కోరింది. ఓటీటీలు, టీవీ ఛానెళ్లు, సినిమా థియేటర్లలో పాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను పూర్తిగా నిషేధించేలా శాశ్వత చట్టపరమైన నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పాక్ కంటెంట్‌ను అనుమతించడం ప్రజల మనోభావాలకు విరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. భారతీయ తెరలపై పాకిస్థానీ ముఖాలు, గొంతులకు చోటు లేదని సంఘం స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!